Tirumala: అలిపిరి మార్గంలో చిరుత సంచారం.. భక్తులకు హెచ్చరిక

తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో నకడదారి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తం చేసింది.

By అంజి
Published on : 28 Oct 2023 7:45 AM IST

Leopard, Alipiri walkway, devotees, TTD, Tirumala

Tirumala: అలిపిరి మార్గంలో చిరుత సంచారం.. భక్తులకు హెచ్చరిక

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలో చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయానికి సమీపంలోని రిపీటర్ స్టేషన్ పరిసరాల్లో ఇటీవల చిరుతపులి, ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు, అటవీశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆందోళన నెలకొంది. ఆంజనేయ స్వామి దేవాలయం, నరసింహ స్వామి దేవాలయం మధ్య ఉన్న కాలిబాట మార్గంలో ఉంచిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపులి, ఎలుగుబంటి సంచారం దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. ఈ రెండు జంతువుల సంచారం ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్య నమోదైందని టీటీడీ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఈ మార్గంలో పలు చిరుతలను టీటీడీ ఫారెస్ట్‌ సిబ్బందితో కలిసి బంధించింది.

ఈ నేపథ్యంలో టీటీడీ, అటవీశాఖ అధికారులు తిరుమలకు వెళ్లే భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, గుంపులుగా కదలాలని సూచించారు. అలాగే భక్తుల భద్రత కోసం టీటీడీ తగిన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు, చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. "ఆలయానికి వెళ్లే భక్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్న అటవీ శాఖ, టిటిడి అధికారులు.. ఈ ప్రాంతాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరికీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకున్నాం" టీటీడీ అధికారి ఒకరు తెలిపారు.

అక్టోబర్‌ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్‌ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.అక్టోబర్‌ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.

Next Story