ఏపీలో నేడు(సోమవారం) కొత్తగా 14 మెడికల్ కాలేజీల నిర్మాణాలను సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొత్తం 16 మెడికల్ కాలేజీలు నిర్మించాలని భావించగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్యకళాశాలలకు శంకుస్థాపన పూర్తయింది. మిగతా 14 మెడికల్ కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యే చోట ప్రస్తుతం ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా ఆస్పత్రులు, సామాజిక ప్రజారోగ్య కేంద్రాలు ఉన్నాయి.
శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లాల పరిధిలో అక్కడి అధికార వర్గాలు పాల్గొంటాయి. 2023 నాటికి ఈ వైద్యకళాశాలలను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు శంకుస్థాపన చేయనున్న కాలేజీలు పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోని ఉన్నాయి. కొత్తగా నిర్మించే 16 వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.