ఎప్పటి లాగే తన పొలం లోకి వెళ్ళాడు ఆ రైతు..! కానీ ఆ రోజు అతడి లైఫ్ మారిపోతుందని అసలు ఊహించి ఉండదు. పొలం పనులు చేస్తూ ఉండగా.. అతడికి మెరుస్తున్న ఓ రాయి కనిపించింది. అది తీసుకుని చూడగా అది రాయి కాదు వజ్రం అని తెలిసింది. గతంలో కూడా ఆ ప్రాంతాల్లో కొందరికి ఇలా వజ్రం రూపంలో అదృష్టం వరించడంతో తనకు బాగానే డబ్బులు రాబోతున్నాయని అనుకున్నాడు. అతడికి వజ్రం దొరికిందన్న విషయం ఓ వజ్రాల వ్యాపారికి తెలియడంతో వజ్రం కొనుక్కోడానికి ముందుకు వచ్చాడు. ఆ ప్రాంతంలో గతంలో గరిష్టంగా 80 లక్షలకు ఓ వజ్రం అమ్ముడైందట.. కానీ ఈ రైతుకు దొరికిన వజ్రం మాత్రం ఏకంగా కోటి 20 లక్షలు పలికింది. ఆ సొమ్మును రైతుకు ముట్టచెప్పి వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు సదరు వ్యాపారి.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామంలో రైతుకు ఓ వజ్రం గురువారం సాయంత్రం లభ్యమైంది. ఈ వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.కోటి ఇరవై లక్షల ఇచ్చి తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రైతు ఎప్పటిలాగే గురువారం పొలం పనులకు వెళ్లాడని.. పనుల్లో ఉండగా అతడికి విలువైన వజ్రం దొరికింది. దీంతో స్థానిక వ్యాపారులకు సమాచారం ఇచ్చాడు. ఓ వ్యాపారి వజ్రాన్ని పరిశీలించాడు. మిగిలిన వ్యాపారులకు వజ్రం ఫొటోలను ఫోన్ ద్వారా పంపించాడు. అందరి కంటే ఎక్కువగా ఓ వజ్రాల వ్యాపారి రూ.1.25 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుక్కున్నాడట. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, మదనంతపురం, తుగ్గలి, పెరవలి పరివాహక ప్రాంతాల్లో ఏటా తొలకరి జల్లులు కురవగానే పొలాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. ఇప్పటి వరకు అత్యధికంగా రూ.80 లక్షల విలువైన వజ్రాలు మాత్రమే లభించాయని, రూ.కోటికి పైగా విలువైన వజ్రం లభించడం ఇదే మొదటిసారి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వజ్రం ధర మార్కెట్ లో ఇంకా ఎక్కువే ఉంటుందని అంటున్నారు.