సీఎం, డిప్యూటీ సీఎంలపై వ్యాఖ్యల కేసులో పోసానికి బెయిల్
వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి ఉపశమనం లభించింది.
By Knakam Karthik
సీఎం, డిప్యూటీ సీఎంలపై వ్యాఖ్యల కేసులో పోసానికి బెయిల్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, నమోదైన కేసులో సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి ఉపశమనం లభించింది. తమ అధినేతలను కించపర్చారని ఆదోని పోలీస్ స్టేషన్‌లో పోసానిపై పలువురు టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై ఐదు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. రూ. 20 వేల పూచీకత్తు, ఇద్దరు జామీనుతో కోర్టు బెయిల్ ఇచ్చింది.
అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆదోని కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు, పోసాని తరపు వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కాగా నరసరావుపేటతో పాటు రాజంపేటలో నమోదు అయిన కేసుల్లోనూ ఆయనకు ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నమోదైన కేసుల్లో పోసానికి కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కర్నూలు జైలులో ఉన్నారు. విజయవాడ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో పోసాని బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు లాయర్లు చెబుతున్నారు.