అమరావతి: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బ్యారేజీ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.02 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. దుర్గమ్మ శరన్నవరాత్రులకు విజయవాడ వచ్చే భక్తులు నదిలోకి దిగొద్దని హెచ్చరించింది. కుళాయిల వద్ద స్నానాలు ఆచరిస్తూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
అటు గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నది 42.4 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ & ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీఎస్‌డీఎంఏ పేర్కొంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి నదిపరీవాహక, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది.
'ఉధృతంగా కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. గోదావరి ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 10.88లక్షల క్యూసెక్కులు, కృష్ణా ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్,ఔట్ ఫ్లో 6.02లక్షల క్యూసెక్కులు ఉందని మరింత పెరిగే సూచనలు ఉన్నాయి' అని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.