ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన జానిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) రాజకీయ అరంగేట్రం చేశారు. నిన్న రాత్రి 'జైభీమ్ భారత్' పార్టీలో చేరారు. విజయవాడలోని గాంధీ నగర్ జై భీమ్ రావు భారత్ పార్టీ కార్యాలయంలో శ్రీను ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్‌కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. కోడి కత్తి శీను కూడా జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం. శ్రీనివాసరావు అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. తాను పేదల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని చెప్పారు. తన నిర్ణయాన్ని కుల, మతపరమైన అంశాలు ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాసనసభలో అడుగుపెట్టాలనుకుంటున్నానని అన్నారు. జగన్ ప్రభుత్వం మోసం చేసిందని భావిస్తున్న శ్రీనివాసరావు దళితుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాలని కృతనిశ్చయంతో ఉన్నాడని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఉన్నారు. తమ పార్టీ పులివెందులలో జగన్‌పై పోటీ చేస్తుందని కూడా శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.