పలనాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. రాజకీయాల్లో గొడవలు సహజమని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. అయితే మాచర్లలో హింసాత్మక ఘటనలు చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. వైసీపీ నేతలను బట్టలు విప్పి కొడతానని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లో చెప్పేవారని, దానిని మాచర్ల టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు మాటల వల్లే మాచర్లలో గొడవలు జరిగి ఉండొచ్చని అన్నారు. తగాదాలు మామూలేనని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 'ఇదేం కర్మ రాష్ట్రానికి' కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కర్రలతో కొట్టుకోవడంతో చాలా మంది ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ పరిస్థితులు హింసాత్మక సంఘటనలకు దారితీయడంతో, పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. మాచర్లలో రంగంలోకి దిగిన పోలీసు బలగాలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాయి. పట్టణంలో పోలీసులు భారీగా మోహరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.