ఎన్టీఆర్ బిడ్డ కోరికను ప్రజలు తీరుస్తారన్న కొడాలి నాని

కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  23 Feb 2024 3:00 PM GMT
ఎన్టీఆర్ బిడ్డ కోరికను ప్రజలు తీరుస్తారన్న కొడాలి నాని

కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. నారా భువనేశ్వరి చెప్పినట్లుగానే చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. కొడాలి నాని స్పందిస్తూ... చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యే కోరుతున్నారని, తన మననులో ఉన్న మాటను భువనేశ్వరి బయటపెట్టారని అన్నారు. ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని, ఐదు కోట్ల ఆంధ్రులం కలిసి చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పచెబుదామని అన్నారు. 2024లో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రెస్ట్ తప్పదని అన్నారు కొడాలి నాని.

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. నారా భువనేశ్వరి చెప్పినట్లుగా చంద్రబాబుకు రెస్ట్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చంద్రబాబు జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోయి భవిష్యత్తులో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లోపిస్తున్నట్లుగా నారా భువనేశ్వరి గుర్తించారని అన్నారు. తన భర్తను 35 ఏళ్లుగా ఆదరించారని ఈసారి ఆయనకు రెస్ట్‌ ఇచ్చి తాను బరిలో నిలవాలని అనుకుంటున్నట్లుగా తన మనసులోమాటను ఆమె బహిర్గతం చేసిందన్నారు. లేదంటే ఎన్టీఆర్‌ కుటుంబానికి చెందిన పార్టీని నారా కుటుంబం లాగేసుకుందనే బాధ ఆమెలోనూ నెలకొని ఆ పార్టీ బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన కూడా అయిండొచ్చన్నారు. చంద్రబాబు 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందిందేమీ లేదన్నారు. 30 వేలమంది పక్కనే ఉన్న తమిళనాడుకు ఉపాధి కోసం వెళ్తున్నారన్నారు. ఆ నియోజకవర్గంలో గెలవడం అసాధ్యం అనే విషయం చంద్రబాబు దంపతులిద్దరికీ తెలుసన్నారు. దీంతో ఎన్టీఆర్‌ కూతురిగా తనకేమైనా అవకాశం ఇస్తారేమోనని భువనేశ్వరి ఆశపడుతోందన్నారు.

Next Story