మాంసం ప్రియులకు పండగే.. ఏపీలో కిలో మటన్ రూ.50కే..!
Kilo Mutton 50 rupees in AP.ఒకప్పుడు పండుగ రోజో లేదా ఎవరైనా అతిథి ఇంటికి వస్తేనే మాంసం వండేవారు.
By తోట వంశీ కుమార్
ఒకప్పుడు పండుగ రోజో లేదా ఎవరైనా అతిథి ఇంటికి వస్తేనే మాంసం వండేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. వారానికి రెండు లేదా మూడు రోజులు మాంసాన్ని తింటున్నారు. కొందరికైతే.. రోజు ముక్కలేనిదే ముద్దదిగడం లేదు. మాంసానికి డిమాండ్ పెరగడంతో వాటి ధరలు కొండెక్కుతున్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కిలో మటన్ రూ.800 పలుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఏపీలో ఓ చోట మాత్రం కిలో మటన్ రూ.50కే విక్రయించారు. దీంతో నాన్ వెజ్ ప్రేమికులు ఎగబడి ఒక్కొక్కరు ఐదారు కిలోల మటన్‌ను కొనుగోలు చేశారు.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో వ్యాపారస్తుల మధ్య తీవ్రమైన పోటి నెలకొనడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. వ్యాపారులు పోటీపడి మరీ ధరలు తగ్గించడంతో కిలో మాంసం రూ.50కే లభించింది. తొలుత గాంధీ బస్టాండ్ వద్ద ఓ దుకాణం దారుడు కిలో మటన్ ను రూ.300కు విక్రయించాడు. దీంతో అతడి దుకాణానికి కొనుగోలు దారులు క్యూ కట్టారు. దీంతో ఇతర దుకాణం దారులు కూడా పోటీపడి రూ.200 నుంచి వందకు తగ్గించేశారు. ఇలా తగ్గించుకుంటూ పోయారు. చివరికి ఓ దుకాణందారుడు రూ.50కే విక్రయించారు. దీంతో కొనుగోలు దారులు ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ కొన్నారు. దీంతో రాత్రి 7.30 రూ స్టాక్ మొత్తం అమ్ముడుపోయింది. అయితే.. కిలో చికెన్ మాత్రం రూ.160కు అమ్మడం గమనార్హం.