అమరావతి: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు. ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబర్ 15 కంటే ముందు ఇళ్లు కట్టుకున్న వారు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
దీనిపై అధికారులు విచారణ చేసి ఎంఆర్‌వో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌లకు నివేదికలు ఇస్తారు. వీటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి తహశీల్దార్ కన్వేయెన్స్ డీడీల రూపంలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తారు. రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు వస్తాయి. గ్రామాల్లో నెలకు గరిష్ఠంగా రూ.10 వేలు, పట్టణాల్లో రూ.14 వేలు ఆదాయం ఉన్నవారు మాత్రమే రెగ్యులరైజేషన్‌కు అర్హులు. నెలకు రూ.300 లోపే విద్యుత్ ఛార్జీలు చెల్లించి ఉండాలి. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. ఆర్‌సీసీ రూఫ్/ ఆస్‌బెస్టాస్ రూఫ్‌ను ఇటుక గోడలతో నిర్మించి ఉండాలి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లులను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తారు.