ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..!
Key Decisions In AP Cabinate Meet. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 4 May 2021 6:09 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. కరోనా కట్టడి కోసం బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పగటి పూట కర్ఫ్యూ సహా పలు అంశాలను చర్చించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. కోవిడ్ కట్టడికి ప్రజలు స్వీయనిర్బంధం పాటించాలని పేర్ని నాని కోరారు. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఇప్పటివరకు 81.66 శాతం హెల్త్ వర్కర్లకు.. 76 శాతం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేశామన్నారు. 24 గంటల్లోనే కరోనా టెస్ట్ రిపోర్ట్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామని.. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. 558 ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్నాం. 100కుపైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కోవిడ్ బాధితుల కోసం 44, 599 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కర్ణాటక, ఒడిశా, చెన్నై, విశాఖ నుంచి ఆక్సిజన్ తీసుకొస్తున్నామన్నారు.
విద్యార్థులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం తెలిపింది. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుందని తెలిపారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇవ్వాలని.. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు.
ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం ఇవ్వనున్నారు. బీ కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.