ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవాలయం పరిసరాల్లో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. ఓ టీ దుకాణం వద్ద దగ్గర జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు టీ తాగేందుకు ఓ దుకాణం వద్దకు వెళ్లాడు. మంచి నీళ్ల విషయంలో టీ షాపు యజమాని కి, కన్నడ భక్తుడి కి మధ్య గొడవ జరిగింది.
గొడవ కాస్త పెద్దదిగా మారడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై దాడి చేశాడు. దీంతో కన్నడ భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన తోటి భక్తులు అతడిని వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు అక్కడ బీభత్సం సృష్టించారు. టీ షాపును తగలబెట్టారు. ఆలయ పరిసరాల్లోని షాపులను ధ్వంసం చేశారు. కనిపించిన వాహనాలకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. డీఎస్పీ శృతి శ్రీశైలం చేరుకున్న తరువాతనే పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.