Kakinada: కోడి పందాల మైదనాల్లో ఏర్పాట్లు కూల్చివేత.. వారికి పోలీసుల హెచ్చరిక

కాకినాడ జిల్లా పోలీసు అధికారులు ఆదివారం వివిధ గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన పలు మైదానాల్లో ఏర్పాట్లను కూల్చివేశారు.

By అంజి  Published on  13 Jan 2025 8:36 AM IST
Kakinada, Police, Arrangements, Cockfight Grounds, APnews

Kakinada: కోడి పందాల మైదనాల్లో ఏర్పాట్లు కూల్చివేత.. వారికి పోలీసుల హెచ్చరిక

కాకినాడ జిల్లా పోలీసు అధికారులు ఆదివారం వివిధ గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన పలు మైదానాల్లో ఏర్పాట్లను కూల్చివేశారు. అధికారులు నిషేధించిన ఏదైనా కార్యకలాపాలకు గ్రౌండ్‌ను ఉపయోగించేందుకు అనుమతిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు ఈ మైదానాల యజమానులను హెచ్చరించారు. కోడిపందాల కోసం మైదానాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందడంతో కాకినాడ పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్.. గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, ప్రత్తిపాడు, అన్నవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, తుని రూరల్, తొండంగి, కోటనందూరు, తిమ్మాపురం, సర్పవరం, కరప, పెదపూడి, గొల్లపాలెం, కోరింగ, ఇంద్రపాలెం, పిఠాపురం టౌన్, పిఠాపురం రూరల్, యు.కొత్తపల్లిలో కోడిపందాల కోసం ముందుగా వేసిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు.

నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత, పోలీసులు భూ యజమానులకు నోటీసులు అందించారు. వారి ఆస్తులను కోడిపందాల కోసం ఉపయోగించకుండా వారిని హెచ్చరించారు. కోడిపందాల కంటే ముందే కోళ్ల కాళ్లకు కట్టే కత్తులను తయారు చేసే వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. కోడిపందాల కోసం సిద్ధం చేస్తున్న మైదానాలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నామని విక్రాంత్ పాటిల్ చెప్పారు. నూజివీడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్య శ్రీనివాస్‌ మాట్లాడుతూ జూదాలు నిర్వహించకుండా వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. గణపవరం మండలం చిన రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎం.బ్రహ్మానందంను నిడమర్రు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుభాష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1,300 కోడిపంద కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Next Story