మాజీమంత్రి సోమిరెడ్డికి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్‌

Kakani Govardhan Slams Somireddy. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసుకునేందుకు కాకాని భారీ కుట్రప‌న్నార‌ని టీడీపీ

By Medi Samrat  Published on  5 Jun 2021 7:39 PM IST
మాజీమంత్రి సోమిరెడ్డికి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్‌

ఆనందయ్య మందుతో వ్యాపారం చేసుకునేందుకు కాకాని భారీ కుట్రప‌న్నార‌ని టీడీపీ నేత‌ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం' అని సోమిరెడ్డికి కాకాని సవాల్ విసిరారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే సోమిరెడ్డి నిరూపించాలని.. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.

ఆయుర్వేదంలో ఆనందయ్యకు ఎంతో అనుభవం ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటించలేదని పంపిణీ నిలిపివేశారు. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీని జిల్లా కలెక్టర్‌ నిలిపివేశారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే.. నేరుగా ఆనందయ్యకే చేయవచ్చు. ప్రభుత్వానికి, వైసీపీకి ఆనందయ్య మందుతో సంబంధం లేదు. అన్ని జిల్లాలకు మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆనందయ్య మందుకు అనుమతుల కోసం ఎంతో కష్టపడ్డాం అని కాకాని గోవర్దన్ తెలిపారు.

ఇదిలావుంటే.. అంత‌కుముందు టీడీపీ నేత సోమిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా ఫస్ట్ వేవ్ లో రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటే.. సెకండ్ వేవ్ లో ఆనందయ్య కుటుంబ సంప్రదాయ వైద్యాన్ని టార్గెట్ చేశార‌ని వ్యాఖ్యానించారు. ఫ్యాన్ గుర్తు సీఎం జగన్, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసీపీ రంగులతో వెబ్ సైట్ హోమ్ పేజీ డిజైన్ చేశార‌ని.. నకిలీ మద్యం, నకిలీ పత్రాలు తరహాలోనే నకిలీ వెబ్ సైట్ రూపకల్పన చేశార‌న్నారు. ఆనందయ్య మందుకోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రజల వద్ద భారీగా వసూలు చేసేందుకు కుట్రప‌న్నార‌ని.. ఆయుర్వేదం మందు ఒక్కో ప్యాకెట్ రూ.167కి అమ్ముకునేందుకు పన్నాగం ప‌న్నార‌ని సోమిరెడ్డి ఆరోపించారు.


Next Story