ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని ప్రజాశాంతి పార్టి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిన్న విశాఖలో ఏడాది పాప కరోనాతో.. ఆక్సిజన్ అందక చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకమని.. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కరోనా కారణంగా పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని.. పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పాల్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పరిస్థితులలో తమ పిల్లలను పరీక్షలకు పంపుతారా? మంత్రులు పంపుతారా? మీ పిల్లలవే ప్రాణాలా? అని ఫైర్ అయ్యారు.
కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారిందని.. దేశంలో ఎన్నో లక్షలమంది ప్రాణాలు కోల్పోయారని.. కుంభమేళా జరిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఉధృతికి కారణమయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రభలడానికి రాజకీయ నేతలు, ఎన్నికల సంఘం కారణం అయ్యారని అన్నారు.
దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. రెండు నెలలుగా ఎన్నో రాష్ట్రాలు తిరిగి, ఎందరో ముఖ్యమంత్రులను కలిశానని అన్నారు. ఏపీకి ఆక్సిజన్, వ్యాక్సిన్, కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విదేశీ నేతలను కోరానని అన్నారు. ఏపీ హైకోర్టు పరీక్షలపై నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉందని.. ఇప్పుడు రాష్ట్రంలో కావాల్సింది రాజకీయ పోటీ, ఫైటింగ్ కాదని.. ప్రజల, విద్యార్థుల ప్రాణాలని అన్నారు.