గుంటూరు తొక్కిసలాట ఘటన.. జ్యుడీషియల్ కమిషన్ విచారణ ప్రారంభం
Judicial commission begins inquiry into the Guntur stampede incident. గుంటూరులో చీరల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది.
By అంజి Published on 19 Jan 2023 6:48 PM IST
గుంటూరులో చీరల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి శేషశయనారెడ్డి నేతృత్వంలోని కమిటీ తొక్కిసలాట జరిగిన మైదానానికి వెళ్లి విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో కమిటీ చైర్మన్ విచారణ చేపట్టారు. చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన వారిని, తొక్కిసలాట సందర్భంగా ప్రత్యక్ష సాక్షులను కమిటీ ప్రశ్నించింది. ఆ రోజు ఏం జరిగిందో వివరించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు కమిటీ ముందు హాజరయ్యారు.
ఎన్ని వాహనాల్లో బహుమతులు తీసుకొచ్చారో రిటైర్డ్ జడ్జి ఆరా తీశారు. ఆ రోజు భద్రతా ఏర్పాట్లను చూసిన డీఎస్పీతో మాట్లాడారు. సంఘటనా స్థలంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, డీఎస్పీలు సీతారామయ్య, జేసీ ప్రశాంతితో మాట్లాడారు. మైదాన విస్తీర్ణంపై కొలతలు తీసుకుని స్థానిక నాయకులతో మాట్లాడారు. సభా వేదిక, ఘటన జరిగిన ప్రదేశం, ఆ సమయంలో అక్కడి పరిస్థితులపై స్థానికులతో ఆరా తీశారు. బాధిత కుటుంబాలను కలిసి.. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు.
తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని స్థానిక టీడీపీ కార్పొరేటర్ ఒకరు తెలిపారు. ఈ నెల 1వ తేదీన సంక్రాంతి కానుక పేరుతో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలుగు దేశం అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ మైదానంలో కార్యక్రమం జరిగింది. చంద్రబాబు కార్యక్రమానికి హాజరై కొందరికి చీరలు పంపిణీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ కాసేపటికే కానుకల కోసం మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.