'చంద్రబాబు పాప పరిహార యాత్ర' అని పేరు పెట్టుకుంటే బాగుండేది : మంత్రి జోగి రమేష్‌

భారతదేశంలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్, సామాజిక న్యాయం అనే పదానికి అసలు

By Medi Samrat  Published on  25 Oct 2023 2:45 PM GMT
చంద్రబాబు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుండేది : మంత్రి జోగి రమేష్‌

భారతదేశంలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్, సామాజిక న్యాయం అనే పదానికి అసలు సిసలైన నిర్వచనాన్ని ఈ నాలుగున్నరేళ్ల పాలనలో చాటిచెప్పారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి మూడు ప్రాంతాల్లో ప్రారంభం కాబోతున్న సామాజిక సాధికార యాత్ర వివరాలను మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ ఇతర పార్టీ ముఖ్య నేతలు వివరించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక సాధికార యాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

జగనన్న పరిపాలన జనం మెచ్చిన పరిపాలన అని.. 77 సంవత్సరాల స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు సీఎం జగన్‌ అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేదలకు – పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో గొంతు గొంతు కలిపి ఏకమై జగనన్నకు అండగా నిలుద్దామని మంత్రి పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో కేబినెట్‌ కూర్పు దగ్గర నుంచి 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించారని మంత్రి తెలిపారు.

"టీడీపీ హయాంలో బీసీ అంటే బిజినెస్‌క్లాస్‌.. జగనన్న పాలనలో బీసీలను సమాజానికి బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా మార్చారు. అలాంటి జగనన్నకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నాం. మూడు విడతల్లో బస్సు యాత్ర ఉంటుంది. మొదటి విడత ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల మూడు చోట్ల కూడా రణభేరి మోగించబోతున్నాం. పెత్తందార్ల కోటలను బద్ధలు కొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలమంతా సంఘటితంగా ముందుకు వెళ్తున్నాం" అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.

నిజం గెలవాలని చంద్రబాబు సతీమణి యాత్ర చేపడుతున్నారని.. నిజం ఈరోజుకైనా గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. పాపం పండింది, అవినీతి బయటపడింది కాబట్టే బాబు రాజమండ్రి జైల్లో ఉన్నాడని, నిజం గెలవాలని కాకుండా చంద్రబాబు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండాయి కాబట్టే అరెస్టు అయ్యారు.. బోన్‌ ఎక్కారు.. కాబట్టి పాప పరిహార యాత్ర అని పేరుతో భువనేశ్వరి యాత్ర చేస్తే బాగుంటుందని సూచించారు.

Next Story