అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటినీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యాక కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మున్సిపల్ చైర్మన్ కావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయం చేశారని అన్నారు. ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి లాగానే జగన్ లో కూడా విలువలు ఉన్నాయని చెప్పారు. ఈరోజు ఆ విషయాన్ని తాను స్సష్టంగా గమనించానని అన్నారు. జగన్ సహకరించకపోతే ఈ రోజు తాను మున్సిపల్ చైర్మన్ అయ్యేవాడిని కాదని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే తాను జగన్ ను కలుస్తానని చెప్పారు. జగన్ తలుచుకుని ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో..తాను మున్సిపల్ చైర్మన్ అయ్యే పరిస్థితి లేదన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని అన్నారు.