ముగిసిన సాయితేజ అంత్యక్రియలు.. కన్నీటి వీడ్కోలు
Jawan saiteja's funeral ended with military formalities.తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన
By తోట వంశీ కుమార్ Published on 12 Dec 2021 10:48 AM GMTతమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతి సంస్కారాలు పూర్తి చేశారు. గాల్లోకి కాల్పులు జరిపి.. సైన్యం గౌరవ వందనం సమర్పించింది. భరతమాత ముద్దుబిడ్డను కడసారి కళ్లారా చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సాయితేజ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
ఈరోజు(ఆదివారం) బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్ వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఎగువరేగడ వరకు దాదాపు 30 కి.మీ మేర సాగిన ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. దారి పొడవునా సాయితేజకు ప్రజలు ఘననివాళి అర్పించారు. స్వగ్రామానికి చేరుకున్న సాయితేజ భౌతిక కాయం చూడగానే ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా ఆయన కుటుంబ సభ్యులు విలపించారు. 'సాయి తేజ అమర్ రహే' నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అనంతరం సాయితేజ వ్యవసాయక్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
తమిళనాడులో ఆర్మీ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, మరో 13 మందితో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లాన్స్ నాయక్ సాయి తేజ కూడా మరణించారు. వీరజవాను సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సాయితేజ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.