బలహీనపడిన జొవాద్.. ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు..!
Jawad Cyclone change course and moves towards Odisha.ఉత్తరాంధ్రకు జొవాద్ తుఫాను ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరం
By తోట వంశీ కుమార్ Published on 5 Dec 2021 4:05 AM GMTఉత్తరాంధ్రకు జొవాద్ తుఫాను ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరం దగ్గరకు వచ్చినట్లే వచ్చి దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రానికి తీవ్రవాయుగుండం బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికీ అది మరింత బలహీన పడి వాయుగుండంగా మారుతుందని చెప్పారు. తుఫాన్ బలహీన పడినా.. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రస్తుతం జొవాద్ తుఫాన్ విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 260 కిలోమీటర్లు, పూరీకి 330 కిలోమీటర్లు, పారదీప్‌కు 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఇక శ్రీకాకుళంలో జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముందే అప్రమత్తమైన అధికారులు 54 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్,కిరండోల్- విశాఖపట్నం, పలాస -విశాఖపట్నం, తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ -తిరుపతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్, హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది.