APPolls: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ పోటీ

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  14 March 2024 3:20 PM IST
janasena, pawan kalyan,   pithapuram,

APPolls: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ పోటీ 

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు వరుసగా తమతమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకాల తర్వాత టీడీపీ, జనసేన ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. గురువారమే టీడీపీ అధినేత చంద్రబాబు 34 మందితో టీడీపీ రెండో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా ఇప్పటికే పలువురిని తమ అభ్యర్థులుగా వెల్లడించారు. కానీ.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం మాత్రం చెప్పలేదు.

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది తాజాగా తాను పోటీ చేయబోయే స్థానం గురించి మాట్లాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు. జనసేన సోషల్‌ మీడియా సమావేశంలో ఈ విషయం చెప్పారు. అయితే.. కూటమితో చర్చలు జరిపిన తర్వాత త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు. అటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అంశంపైనా ఆయన ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా స్వయంగా తాను పోటీ చేయాలనకునే స్థానం పిఠాపురం అని చెప్పడంతో.. ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాగా.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయగా రెండు చోట్లా ఆయన ఓటమిపాలయ్యారు. ఇక ఈ సారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ గెలవడం పక్కా అని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌ అభిమానులు చెబుతున్నారు.

Next Story