చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు: పవన్ కళ్యాణ్
చంద్రబాబు ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు పవన్ కళ్యాణ్ .
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 7:15 AM GMTచంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు: పవన్ కళ్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయ్యి.. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ నాయకులు, ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా..ఇటీవల చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని టీడీపీ నేతలతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్న విషయం తెలిసిందే. నారా లోకేశ్ సహా ఇతర నాయకులు అయితే.. ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని.. చంద్రబాబుని అంతమొందించే కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం జైల్‌లో ఆయనకు ఉండాల్సిన సదుపాయాలు ఉన్నాయని.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కానీ కుటుంబ సభ్యులే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చెబుతున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఈ ప్రభుత్వ వైఖరి అమానవీయం. ఆయన ఆరోగ్య సమస్యలపై మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదు. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం సరికాదు. జైళ్లశాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి.చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అధికార, విపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ సహా జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో పాటు.. టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ @ncbn గారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Nlq3u9U35K
— JanaSena Party (@JanaSenaParty) October 15, 2023