అసెంబ్లీ ఎన్నికలకు రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సందర్బంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 11:31 AM ISTఅసెంబ్లీ ఎన్నికలకు రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సందర్బంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రెండు పార్టీలు ఎన్నికల్లో పోటీకి కలిసి వస్తున్నా.. టీడీపీ ఇప్పటికే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థి, అలాగే అరకు అభ్యర్థిని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సంచలన ప్రకటన చేశారు. రిపబ్లిక్ డే రోజుల వేడుకల్లో పాల్గొన్న ఆయన రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ముందే ఆ నియోజకవర్గాల పేర్లను చెప్పారు.
గణతంత్ర దినోత్సవం రోజున పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. టీడీపీతో పొత్తు కొనసాగుతుందని మరోసారి ప్రస్తావించారు. అయితే.. చంద్రబాబుపై ఎన్నికల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్.. వారు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు లాగే తనపై కూడా ఒత్తిడి ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాక.. రిపబ్లిక్ డే రోజున తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే రెండు స్థానాలను ప్రకటిస్తున్నానని చెప్పారు. రాజోలు, రాజానగరంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ లాగా తనకు రిపబ్లిక్‌డే కలిసివస్తుందని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో పార్టీ నేతలు సంతోషంతో కేకలు వేస్తూ చప్పట్లు కొట్టారు. ఇక స్థానాలను ప్రకటించినా.. పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడే అభ్యర్థులను వెల్లడించలేదు. త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మరోవైపు ఇతర పార్టీ నాయకులు జనసేన, టీడీపీ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు. పొత్తు అంటూనే ఎవరికి వారు ఏకపక్షంగా పోటీ చేసే స్థానాలను ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కౌంటర్‌గా జనసేన కూడా అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
— Newsmeter Telugu (@NewsmeterTelugu) January 26, 2024
రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిన జనసేనాని
రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తామని వెల్లడి
చంద్రబాబు లాగే తనపైనా ఒత్తిడి ఉందంటూ పవన్ వ్యాఖ్య pic.twitter.com/q6a7ngUzzW