ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 1:34 PM GMTఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అధికార పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. పోటీ చేసిన అన్ని చోట్లలో ఆ పార్టీ గెలుపును నమోదు చేసుకుంది. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసకుంది. గతేడాది కేవలం ఒక్కటే స్థానంలో గెలిచిన జనసేన.. ఈసారి ఏకంగా 21 స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలో గెలుపొందింది.
టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు వచ్చాయి. తోక పార్టీ అంటూ పలువురు ఎద్దేవా చేశారు. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం ప్రభుత్వ ఓటు చీల్చకూడదనే పొత్తు పెట్టుకున్నామని.. వైసీపీ విముక్త ఏపీ చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇక సీట్ల సర్దుబాటు విషయంలో మరోసారి విమర్శలకు గురయ్యారు పవన్. పార్టీ అధ్యక్షుడు అయి ఉండి తక్కువ స్థానాలను ఎలా ఒప్పుకున్నారంటూ తిట్టిపోశారు పలువురు నేతలు. ఎక్కడా పవన్ మాత్రం తగ్గలేదు. అందరికీ సమాధానాలు ఇస్తూనే.. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు జనసేన నుంచి టికెట్ ఆశించిన వారిని బుజ్జగించారు. అందరినీ ఒంటి చేత్తో గెలిపించుకున్నారు. వందకు వంద శాతం రిజల్ట్‌ను సాధించారు. ఇక జనసేన నుంచి పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేస్తున్నారు.