కలియుగ దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం ఉదయం సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద మంత్రోచ్చారణ పలికి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం దేవస్థాన అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
స్వామి దర్శనం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఏడాది నుంచి స్వామివారి ఆశీస్సుల కోసం రావాలని అనుకున్నానని.. కానీ కరోనా కారణంగా రాలేకపోయానని చెప్పారు. ఈ రోజు తనకు స్వామివారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని, రాజీకీయాలపై తిరుపతి ప్రెస్‌మీట్‌లో మాట్లాడతానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆలయ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాషాయ దుస్తులలో పవన్ ని చూసిన ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ చిత్రం తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ రీ ఎంట్రీ ఫిల్మ్‌గా చెబుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.