క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 12:52 PM ISTక్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలులో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోదరుడు నాగబాబు, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేదపండితులు పవన్ కల్యాణ్‌కు ఆశీర్వచనం అందించారు.
పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని ఆయన దీమా వ్యక్తం చేశారు. క్రోధి నామ సంవత్సరంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని అన్నారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని.. రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం అందాలని కోరుకుంటున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరుకుంటున్నట్లు చెప్పారు.
కాగా.. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లను కేటాయించారు. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్.. ప్రజల సంక్షేమం కోసం.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే తాము ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.