వర్సిటీలను అధికార పార్టీ ఆఫీసులుగా మార్చొద్దు: పవన్ కల్యాణ్
Janasena Chief Pawan Kalyan Comments on Universities. సీఎం జగన్ జన్మదిన వేడుకలకు విశ్వవిద్యాలయాల్లో ప్లెక్సీలు కట్టి వేడుకలు నిర్వహించటం
By అంజి Published on 22 Dec 2022 12:09 PM GMTసీఎం జగన్ జన్మదిన వేడుకలకు విశ్వవిద్యాలయాల్లో ప్లెక్సీలు కట్టి వేడుకలు నిర్వహించటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి వర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారన్నారు.
విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చొద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోందని ప్రశ్నిస్తారు. ''విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చివేసి, ఆ పార్టీ సీఎం ఫ్లెక్సీలతో ప్రాగంణాలు నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోంది.ఫ్లెక్సీలు పెట్టడం వల్ల పర్యావరణానానికి హాని కలుగుతుందని సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడం కోసం కట్టడం విచిత్రంగా ఉంది'' అని పవన్ కల్యాణ్ అన్నారు.
తొమ్మిది దశాబ్దాలకు పైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణణ్, సి.ఆర్.రెడ్డి లాంటి గొప్ప వారు వైస్ ఛాన్స్‌లర్‌లుగా బాధ్యతలు నిర్వహించిన సరస్వతి ప్రాంగణం ఆంధ్ర విశ్వవిద్యాలయమని అన్నారు. ఆ విద్యా వనం నుంచి ఎందరో మేధావులు వచ్చారని, అలాంటి చోట్ల చిల్లర రాజకీయాలు చేస్తూ, పార్టీ ఫ్లెక్సీలు కట్టించే వాళ్లు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తోందని విమర్శించారు.
విశ్వ విద్యాలయ వైస్ ఛాన్స్‌లర్‌లకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. విశ్వ విద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం వైస్ ఛాన్స్‌లర్లు బాధ్యతగా పని చేయాలని పవన్‌కల్యాణ్ సూచించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు.