175 నియోజకవర్గాల్లో గెలిచినంత ఆనందంగా ఉంది: పవన్ కళ్యాణ్

మొత్తం 175 సీట్లు గెలిచినంత సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Jun 2024 4:00 PM GMT
janaena, pawan kalyan,   ap results ,

175 నియోజకవర్గాల్లో గెలిచినంత ఆనందంగా ఉంది: పవన్ కళ్యాణ్  

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ఇక చీకటి రోజులు ఉండవు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించే బాధ్యత నాపై ఉంది" అని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70, 279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన జనసేన పార్టీ (జేఎస్పీ) అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలను క్రికెట్ మ్యాచ్‌తో పోలిస్తే.. కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కొచ్చు. NDA భాగస్వామ్య పక్షాల మధ్య ఓట్ల కోతను నివారించడంలో కీలక పాత్ర పోషించారు. ఏకకాలంలో 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ దాదాపు కింగ్ మేకర్‌గా కీలక పాత్ర పోషించారు.

తాను గెలిచిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ఇక నుంచి 5 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, ప్రతి కుటుంబంలో భాగస్వామిని అవుతాను. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నాకు గొప్ప బాధ్యతను ఇచ్చారు, మొత్తం 175 సీట్లు గెలిచినట్లు భావిస్తున్నాను' అని అన్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చామో అది కచ్చితంగా నెరవేరుస్తామని.. ముఖ్యంగా ఓ జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేయడానికి కృషి చేస్తామని అన్నారు. వైసీపీ అధినేత‌ వైఎస్‌ జగన్ త‌న‌కు వ్యక్తిగత శత్రువు కాద‌న్నారు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదన్నారు. వైసీపీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని.. కూట‌మికి ఘన విజయం అందించిన‌ ఏపీ ప్రజలకు మంచి చేయడానికి కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని చెప్పారు. 2019లో ఓడిపోయిన‌ప్పుడు త‌న‌ మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు గెలిచాక కూడా అలాగే ఉంద‌న్నారు. ఆంధ్ర ప్ర‌జ‌లు త‌న‌కు ప‌రువు ఇచ్చారన్నారు. ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని.. వారి కష్టాలలో పాలుపంచుకుంటాన‌ని అన్నారు. మీ కుటుంబంలో ఒక‌డు అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడని అనుకోవాలన్నారు ప‌వ‌న్. ప్రభుత్వం ఎలా ఉండాలి.. అధికార యంత్రాంగం ఎలా ప‌ని చేయాలి అనే విష‌యాల‌ను రాబోయే రోజుల్లో చేసి చూపిస్తాన‌ని హామీ ఇచ్చారు.

కూటమి విషయంలో ఫలించిన పీకే వ్యూహం:

ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం ఒప్పందంలో భాగంగా.. టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాల నుండి పోటీ చేయగా, బీజేపీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. JSP రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని తొలిసారిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బీజేపీని కూడా కూటమిలోకి భాగం చేశాడు పవన్ కళ్యాణ్.

జనసేన సత్తా.. పవన్ కళ్యాణ్ దూకుడు:

2014 ఎన్నికలకు ముందు స్థాపించిన జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో రాజోలు నుండి రాపాక వరప్రసాద్ రూపంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి భారీగా ఓట్లను సొంతం చేసుకుంది. జనసేన కూడా 20 స్థానాలలో విజయాన్ని సాధించింది. తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా 2008లో తొలిసారిగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఎన్నికల్లో విజయం సాధించారు.

Next Story