కర్ణాటకలో పవన్ కళ్యాణ్.. ఎందుకు వెళ్లారంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనకు వెళ్లారు.
By - Knakam Karthik |
కర్ణాటకలో పవన్ కళ్యాణ్.. ఎందుకు వెళ్లారంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనకు వెళ్లారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణిలో జరిగిన జస్టిస్ వి. గోపాల గౌడ అమృత మహోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. జస్టిస్ గోపాల గౌడ కేవలం మాజీ న్యాయమూర్తి మాత్రమే కాదని, పాలకుల తప్పులను, రాజ్యాంగ ఉల్లంఘనలను నిర్భయంగా ప్రశ్నించే ఒక నిత్య పోరాట యోధుడని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయని తన భుజం తట్టి ధైర్యం చెప్పిన వ్యక్తి ఆయన అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, విలువలను జస్టిస్ గోపాల గౌడ ఎంతగానో గౌరవిస్తారని, గతంలో భూసేకరణ చట్టం, నల్లమల యురేనియం తవ్వకాలు వంటి అంశాలపై జనసేన చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తే తమ పోరాటానికి బలమైందన్నారు. తాను ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత జస్టిస్ గోపాల గౌడ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని పవన్ వెల్లడించారు. ఆయన వంటి మహానుభావుల సహకారం, పరిచయం జనసేన పార్టీకి, రాబోయే తరాల భవిష్యత్తుకు పెద్ద అండ అని అన్నారు.
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో జస్టిస్ వి. గోపాల గౌడ అమృత మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా చింతామణిలో కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.