ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ఓ జంట ప్రమేయం ఉందని కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు మరింత లోతుగా జరిగితే వారి పేర్లు, ఆ విషయం బయటకు వస్తుందన్నారు. హత్యకేసును సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 90 శాతం ఛేదించిందన్నారు. మిగిలిన 10 శాతం పూర్తి చేయించి అసలైన హంతకులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో తన విజయానికి కారణమైన నేతలు, కార్యకర్తలను కలుసుకున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి కూటమి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిందని, ప్రజలకు 25 శాతం డబ్బులు పంచిన జగన్.. మిగతావి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే వివేకా హత్య కేసుతోపాటు కోడికత్తి కేసు విషయమై కూడా వైఎస్ జగన్‌ను ప్రస్తావిస్తానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.