ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయింది. ఎన్నికల నిబంధనావళిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సూచనలతో దాదాపు అన్ని పథకాలకు బ్రేకులు పడినట్టే. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని ఆ లేఖలో తెలిపారు. పట్టణ, నగర ప్రాంతాలలో ప్రవర్తనా నియామళి అమలులో ఉండదని స్పష్టం చేశారు. అమలులో ఉన్న పథకాలను కూడా నిలిపి వేయాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ ఉన్నపళంగా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకానికి కూడా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుంది.
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లల విద్యా వ్యయంలో ఆర్ధిక సహాయంగా తల్లుల ఖాతాలో ఏడాదికి 15వేల రూపాయలు వేయనుంది. ఈనెల 11వ తేదీన అమ్మఒడి రెండో విడుత నిధులు విడుదల చేయాల్సి ఉంది. నిధుల విడుదలకు సంబంధించి జీవో నెంబర్ 3ను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల కోడ్ ఉండడంతో.. ఈ కార్యక్రమం కొనసాగుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ఆగబోదని.. పథకాన్ని యథాతధంగా అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన జీఓ కూడా ఇప్పటికే విడుదల అయ్యిందన్నారు. తల్లులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో చేపట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరులో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం సోమవారం ప్రారంభిస్తారని ఆయన తేల్చి చెప్పారు.