AP: నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు.. రూ.350 కోట్లు జమ చేయనున్న సీఎం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురువారం జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న చేదోడు నిధులను విడుదల చేయనున్నారు.
By అంజి Published on 19 Oct 2023 7:15 AM ISTAP: నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు.. రూ.350 కోట్లు జమ చేయనున్న సీఎం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైడబ్ల్యూసీఎస్ మైదానంలో గురువారం జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న చేదోడు నిధులను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించి, ఆన్‌లైన్ ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,25,020 మంది రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ల ఖాతాలలో ఆర్థిక సహాయంగా రూ.325.02 కోట్లు జమ చేస్తారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. బీసీ వర్గాలే మన సమాజానికి వెన్నెముక అనే అచంచలమైన నమ్మకంతో జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ వర్గాల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తోందని.. వారికి సాధికారత కల్పిస్తున్నామని అన్నారు.
జగనన్న చేదోడును వరుసగా నాలుగో సంవత్సరం అందిస్తున్నామని, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కిందనే ఇప్పుడున్న సాయంతో కలిపి మొత్తం రూ.1,252.51 కోట్ల ఆర్థిక సాయం అందించిందని మంత్రి వివరించారు. ఈసారి 1,80,656 మంది టైలర్లకు రూ.180.66 కోట్లు, 1,04,551 మంది రజకులకు రూ.104.55 కోట్లు, 39,813 మంది నాయీబ్రాహ్మణులకు రూ.39.81 కోట్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త పద్ధతిలో లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కృష్ణ తెలిపారు. "ఏదైనా అర్హత ఉన్న వ్యక్తి ఏ కారణం చేతనైనా ఈ పథకం నుండి మినహాయించబడితే, వారికి దరఖాస్తు చేసుకోవడానికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది. ధృవీకరణ తర్వాత అర్హత ఉన్నట్లు గుర్తించినట్లయితే, వారికి ప్రతి సంవత్సరం జూన్ లేదా డిసెంబర్‌లో పంపిణీ సమయాన్ని బట్టి ప్రయోజనం ఇవ్వబడుతుంది" అని అన్నారు. వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వం ఇప్పటి వరకు దుకాణాలు కలిగి ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్‌లకు ఏటా రూ.10 వేలు ఇస్తోంది.