ఏపీలో కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు
Jagan Key Decision About Curfew. రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
By Medi Samrat Published on 17 May 2021 1:26 PM ISTఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కరోనా కట్టడికి సరైన ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం జగన్ భావించారు. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని.. ఇంకొన్ని రోజులు కర్ఫ్యూను అమలు చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని జగన్ అధికారులతో చెప్పారు.
ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని జగన్ సూచించారు. అటువంటి పిల్లలకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కోవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సత్వరమే వైద్యం అందించేలా ఆర్టీసీ స్లీపర్ ఏసీ బస్సుల్లో పది ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్లు ఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం గ్రీన్‌కో సంస్థ అధినేత చలమలశెట్టి అనిల్ ముందుకొచ్చారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో త్వరలోనే మొబైల్ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకొస్తాయన్నారు. ఇలానే దాతలు మరింత మంది ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు వైద్య కోర్సు చేసిన వారు, నర్సింగ్ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు.