2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న 'రెడ్ బుక్' పై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

By -  అంజి
Published on : 2 March 2026 7:02 AM IST

YS Jagan, AP Chief Minister, Kodali Nani, coalition government, APnews

2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న 'రెడ్ బుక్' పై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమని, రెడ్‌బుక్‌లో జగన్‌ పేరు ఉంటే లోకేశ్‌కే ఇబ్బంది అని హెచ్చరించారు. ఆదివారం ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించి, ఇటీవల కూటమి ప్రభుత్వం, టీడీపీ శ్రేణుల దాడులకు గురైన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నాని, రాబోయే ఎన్నికల ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ శ్రేణులు కావాలనే అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టాయని కొడాలి నాని ఆరోపించారు.

"ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, టీడీపీ నేతలు కనికరం లేకుండా ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది" అని ఆయన మండిపడ్డారు. నారా లోకేష్ ప్రస్తావిస్తున్న 'రెడ్ బుక్' అంశంపై కొడాలి నాని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికార అహంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నేతలను వేధిస్తోందని, ఇటువంటి బెదిరింపులకు పార్టీ శ్రేణులు ఎవరూ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. "రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాల్సింది పోయి, కక్ష సాధింపు చర్యలకు దిగడం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది" అని హెచ్చరించారు.

2029లో జగన్ సీఎం కావడం తథ్యం

ప్రస్తుత రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని కొడాలి నాని పేర్కొన్నారు. "ఇప్పుడు ఎన్ని వేధింపులకు గురిచేసినా, 2029లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయం. ఇది చారిత్రక అవసరం. అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు" అని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కొడాలి నానితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. అంబటి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.

Next Story