పదేళ్ల వరకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన విపక్ష నాయకుడిగా కూడా పనికి రాడని ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. ప్రతిపక్ష హోదా రావడానికి అర్హతలు ఏంటో ఆయన గతంలో సభలో చెప్పారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరొకలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఓనమాలు కూడా తెలియకుండా స్పీకర్‌కు లేఖ ఎలా రాశారని మండిపడ్డారు. జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా పొందే అవకాశం లేదని మంత్రి పయ్యావుల అన్నారు.
మొత్తం సభ్యుల్లో పదో వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని, జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే అని స్పష్టం చేశారు. స్పీకర్ కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని , తన ఖాతా పుస్తకాలతో పాటు నిబంధనలు కూడా చదవాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని, 1984లో రాజ్యసభ ఎంపీ ఉపేందర్, 1994లో జనార్దన్ రెడ్డిలకు ప్రతిపక్ష హోదా కాదు.. ఫ్లోర్ లీడర్ హోదా మాత్రమే ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.