అభ్యర్థులకు అలర్ట్‌.. ఈ నెల 15న మెగా డీఎస్సీ తుది జాబితా..!

16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

By -  అంజి
Published on : 10 Sept 2025 8:12 AM IST

Mega DSC, APnews, Department of Education, Teacher posts

అభ్యర్థులకు అలర్ట్‌.. ఈ నెల 15న మెగా డీఎస్సీ తుది జాబితా..!

అమరావతి: 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అలాగే ఈ నెల 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే 19వ తేదీన సభ నిర్వహించాలని భావిస్తోంది. ఆ సభలోనే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు.

కొత్త టీచర్లకు దసరా సెలవుల్లో ట్రైనింగ్‌, కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారని, సెలవుల అనంతరం స్కూళ్లు పునః ప్రారంభం రోజున వారంతా విధుల్లో చేరతారని సమాచారం. డీఎస్సీ మెరిట్‌ జాబితా ఇప్పటికే విడుదల కాగా.. సర్టిఫికెట్ల పరిశీలన కూడా నిన్నటితో పూర్తి అయ్యింది. టీచర్‌ పోస్టులకు ఎంపికైన డీఎస్సీ జాబితాలు 15న విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

అధికారులు అర్హుల జాబితాలను మరోసారి నిశితంగా పరిశీలిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పరిశీలన పూర్తయిన తర్వాత జాబితాలను జిల్లాలకు పంపి డీఎస్సీ కమిటీలతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15న తుది జాబితాలు ప్రకటిస్తారు. సెలవుల అనంతరం బడుల పునఃప్రారంభం రోజున కొత్త టీచర్లు పాఠశాలల్లో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తగ్గట్టుగా విద్యాశాఖ ముందుకు అడుగులు వేస్తోంది.

Next Story