విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే ఇంటర్ తరగతులు
ఇంటర్ విద్యను రాష్ట్ర సర్కార్ పూర్తిగా మార్చేసింది. రాష్ట్రంలో రేపటి నుండే 2025 - 26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
By అంజి
విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే ఇంటర్ తరగతులు
అమరావతి: ఇంటర్ విద్యను రాష్ట్ర సర్కార్ పూర్తిగా మార్చేసింది. రాష్ట్రంలో రేపటి నుండే 2025 - 26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్‌లో చేరే వారికి 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 2వ తేదీన తిరిగి క్లాసులు పునఃప్రారంభం కానున్నాయి. అలాగే జూనియర్ కాలేజీల పని వేళలలనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించి, ఏడు పీరియడ్లను 8 పీరియడ్లు చేశారు. ఈసారి కార్పొరేటు కాలేజీల తరహాలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా అడ్మిషన్లకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నాయి.
ఇంటర్ సబ్జెక్టులు, కోర్సుల్లో విద్యాశాఖ కీలక మార్పులు ప్రవేశపెట్టింది. బైపీసీలో బోటనీ, జువాలజీని బయాలజీగా, ఎంపీసీ విద్యార్థులకు గణితం ఏ, బీలుగా ఉండగా.. దాన్ని ఒక్కటిగా చేసింది. సైన్స్ విద్యార్థులకు ఆరు సబ్జెక్టుల స్థానంలో ఐదు సబ్జెక్టులు ప్రవేశపెట్టింది. ఇందులో ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది. 3 సంబంధిత గ్రూపు కోర్ సబ్జెక్టులుగా ఉంటాయి. మరొకటి ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలక్టివ్ సబ్జెక్టు కాకుండా మిగిలిన ఐదు సబ్జెక్టులు కచ్చితంగా పాస్ కావాలి. సీబీఎస్‌ఈ తరహాలో ఇంటర్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశ పెట్టబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు ముగిస్తారు. కాలేజీల పనిదినాలను 222 నుంచి 235కు పెంచింది.