నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యాఖ్యలు వేడి పెంచుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్ట్‌తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరు ఇస్తామని, గోదావరి - కృష్ణాలో వాటాలు దక్కాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వ్యూహాలు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ అనడంతో రెండు రాష్ట్రాల జల జగడం ఇప్పట్లో తేలుతుందా అనే చర్చ మొదలైంది.
విజయవాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదన్నారు. ఎవరూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నామన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామని, అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఏంటి?, వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.