జనం మూడ్ జగన్ వైపే!
India Today Survey Jagan will win in ap again.జనం మూడ్ జగన్ వైపే!
By సునీల్ Published on 13 Aug 2022 6:52 AM GMT- ఇండియా టుడే సర్వేలో వెల్లడి
- టాప్ 5లో చోటు
- టీడీపీకీ పెరిగిన గ్రాఫ్
- అంతర్గత సర్వేల్లోనూ అవే ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ బలం పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీకి కూడా ప్రజల్లో మద్దతు పెరుగుతున్నట్లు ఫలితాలు ఉన్నాయి. తాజాగా ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరుతో నిర్వహించిన సర్వేలో సీఎం 'జగన్' వైపు ప్రజల మూడ్ ఉన్నట్లు వెల్లడైంది. కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీకే మళ్లీ సానుకూల పవనాలు వీస్తున్నట్లు సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి ఎలాంటి ఢోకా లేదు. కానీ ఎంపీ, అసెంబ్లీ సీట్లు మాత్రం కాస్త తగ్గనున్నట్లు తెలిపింది.
25లో 18
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల్లో 18 సీట్లలో వైసీపీ గెలుపు ఖాయమని సర్వే వెల్లడించింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 25 సీట్లకుగాను 22 వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు మూడు సీట్లు గెలుచుకున్న టీడీపీకి ఈసారి ఏడు స్థానాలు దక్కుతాయని ప్రజాభిప్రాయంగా సర్వే తెలిపింది. ఈ లెక్కల ప్రకారం వైసీపీకి ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు కానీ ప్రతిపక్ష టీడీపీ కూడా బలం పుంజుకుంటున్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలపై మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంది.
మళ్లీ అధికారంలోకి..
అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగుతుందని సర్వే వెల్లడించింది. ప్రజాకర్షక సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్ ప్రత్యేక ఓట్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో 175కు 151 స్థానాల్లో జెండా ఎగరేసిన వైసీపీ ఈసారి కూడా గెలవనుంది. అయితే 126 స్థానాల్లో విజయావకాశాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ లెక్కన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ కాస్త బలపడినట్లే అనుకోవచ్చు. మరోవైపు జాతీయ పార్టీగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీకి మాత్రం ఒక్క సీటూ దక్కే అవకాశాలు లేవు.
అంతర్గత సర్వేల్లో ఇలా..
ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నప్పటికీ రాష్ట్రంలో ఆ మూడ్ వచ్చేసింది. వైసీపీ గడప గడపకు, టీడీపీ ప్రజా యాత్రకు, జనసేన బస్సు యాత్రకు సిద్ధమయ్యాయి. నేతలంతా పదునైన ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా అంతర్గత సర్వేలు చేయిస్తున్నాయి. ఈ సర్వేల్లోనూ వైసీపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారం సాధిస్తుందని వెల్లడైనట్లు సమాచారం. ఈ ఫలితాలతో వైసీపీలో ఫుల్ జోష్ నెలకొంది. టీడీపీ మాత్రం వ్యూహం మార్చి, ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తెలంగాణ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోరు తప్పదని కనిపిస్తుండగా.. ఏపీలో మాత్రం జనసేన- బీజేపీ కూటమి బరిలో ఉన్నప్పటికీ 25 నుంచి 30 స్థానాల్లోనే బలమైన పోటీ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
పొత్తులపైనే అందరి చూపు..
అధికార వైసీపీని బలంగా ఎదుర్కోవాలంటే పొత్తులు కట్టక తప్పదని సీనియర్లు చెబుతున్నారు. వైసీపీ ఈసారి కూడా సింగిల్‌గానే బరిలోకి దిగనుంది. మిగతా పార్టీల పొత్తులపైనే అంతటా చర్చ జరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలోనూ పలువురు నాయకులు చంద్రబాబు వద్ద పొత్తుల విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ కూడా సానుకూలంగా పలకరించడంతో 2014 సీన్ రిపీట్ అవుతుందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో కలిసున్నామని, ఎన్నికలకూ కలిసి వెళ్తామని చెబుతున్నారు. దీనిపై జనసేనాని కూడా ఎవరైనా సంప్రదిస్తే చూద్దామన్న వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మొత్తంగా పొత్తు పొడిస్తే తప్ప రాబోయే ఎన్నికల్లో వైసీపీది వన్ మాన్ షోయేనని తెలుస్తోంది.