అమరావతి: రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఈఎంఆర్‌ఎస్ స్కూళ్లలో విద్యార్థులకు చికెన్ నిలిపివేస్తున్నట్టు గురుకులాల సెక్రటరీ సదా భార్గవి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 171 గిరిజన గురుకులాలు, 28 ఈఎంఆర్‌ఎస్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూలో భాగంగా అందిస్తున్న చికెన్‌ను నిలిపివేశారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సదా భార్గవి వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చికెన్ పెట్టొద్దని సూచించారు. చికెన్ బదులుగా పండ్లు, స్వీట్లు, వెజ్ కర్రీ అందిస్తామని చెప్పారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనం వివరాలను ఎప్పటికప్పుడు నిర్దేశిత యాప్‌లో నమోదు చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చికెన్ పెట్టకూడదని ఆమె అధికారులను ఆదేశించారు. అటు బర్డ్ ఫ్లూపై తప్పుడు ప్రసారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం నాడు కలెక్టర్లతో బర్డ్‌ఫ్లూ, దాని నియంత్రణ చర్యలపై సమీక్ష చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటించాలని సూచించారు. చనిపోయిన కోళ్లను సరైన విధానంలో పూడ్చిపెట్టెలా చర్యలు తీసుకోవాలన్నారు.