దారుణం: రోజూ 200 గుంజీలు.. నడవలేని స్థితిలో బాలికలు
అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో అమానవీయ ఘటన జరిగింది.
By అంజి Published on 17 Sept 2024 10:11 AM ISTదారుణం: రోజూ 200 గుంజీలు.. నడవలేని స్థితిలో బాలికలు
అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో అమానవీయ ఘటన జరిగింది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన విద్యార్థినులతో మూడు రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించారు. దీంతో 50 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. పేరెంట్స్‌కు సమాచారం తెలియడంతో వారు వచ్చి పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికలను చేతులపై మోసుకెళ్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థినులు.. తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి భావించారు. దీంతో వారిని శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థినులను రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తీయించారు. ఈ వ్యవహారం మూడు రోజులు నుంచి జరుగుతోంది. సోమవారం నాడు కూడా గుంజీలు తీయించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
కొంతమంది ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని విద్యార్థినులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవీ స్పందించారు. ఇది దారుణమైన చర్య అని, దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు.