ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ సిక్స్ హామీలను త్వరలో అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా గ్రామాల్లో అనేక సీసీ రోడ్లు అధ్వానంగా మారాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప గ్రామంలో మంత్రి పర్యటించి నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
గత ఐదేళ్లలో తీవ్రంగా నిర్వీర్యమైన పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడంపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించిందని, గ్రామ పంచాయతీల్లో ఖాళీలను పరిష్కరించి సమర్థవంతమైన పరిపాలనను పునరుద్ధరించడంపై తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని మంత్రి తెలిపారు. బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జనార్దన్‌రెడ్డి నంద్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి వినతులు సేకరించారు. స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.