బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే ఛాన్స్.. అతి భారీ వర్షాలు

డిసెంబర్ 3 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం సూచనను జారీ చేసింది.

By అంజి  Published on  1 Dec 2023 5:37 AM GMT
IMD, cyclone, Bay of Bengal , APnews

బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే ఛాన్స్.. అతి భారీ వర్షాలు

డిసెంబర్ 3 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) గురువారం సూచనను జారీ చేసింది. ఒక వేళ తుఫాను ఏర్పడితే దానిని మిచౌంగ్‌గా పిలుస్తారు. ఇది ఎక్కడ తీరం దాటుతుందన్నదానిపై ఇవాళ సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతాల మధ్య దాటొచ్చనేది అధికారుల అంచనా. ఇది ఏపీపై ప్రభావం చూపిస్తుందని.. దక్షిణ కోస్తాలో 3,4వ తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఒడిశాపై తుఫాను ప్రభావం గురించి ఐఎండీ సూచించలేదు.

శుక్రవారం సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపాను ప్రభావం అంచనా వేయగలమని ఐఎండీ తెలిపింది. “అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుఫాను, ఇతర పారామితుల యొక్క మార్గాన్ని అంచనా వేయవచ్చు. అందువల్ల ఒడిశాపైనా లేదా కోస్తాలోని మరే ఇతర ప్రాంతాలపైనా ప్రభావం చూపడంపై మేం ఇప్పుడే ఏమీ చెప్పలేం’’ అని ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాష్ తెలిపారు. వచ్చే నాలుగు రోజుల పాటు ఒడిశా తీరానికి ఎలాంటి హెచ్చరికలు లేవని దాస్ స్పష్టం చేశారు. ఒడిశా తీరానికి వెళ్లే మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఆయన చెప్పారు.

ఇదిలావుండగా.. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా బుధవారం నాటి అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఉందని ప్రత్యేక బులెటిన్‌లో ఐఎండీ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది.

"మరింత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, డిసెంబర్ 3 నాటికి ఇది నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా క్రమంగా తీవ్రమవుతుంది" అని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుంది. డిసెంబర్ 4 తెల్లవారుజామున తుఫానుగా ఏర్పడనుంది. అయితే, ఊహించిన వ్యవస్థ ప్రభావంతో, డిసెంబర్ 1 ఉదయం నుండి నైరుతి బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ నుండి 60 కి.మీ వరకు మరియు డిసెంబర్ 2 ఉదయం నుండి 50-60 కి.మీ నుండి 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది

Next Story