ఆంధ్రప్రదేశ్‌లో నిన్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం కూడా బాగానే నమోదు అయ్యిందని ఎన్నికల సంఘం తెలిపింది. నిన్న ఓటు వేసిన ప్రజలకు సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
''నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని సీఎం జగన్ అన్నారు.
'వైసీపీ కోసం గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను' అని సీఎం జగన్ అన్నారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని 79.40 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా పేర్కొన్నారు.