సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి భారీ ఊరట
వైఎస్‌ఆర్‌సీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి, బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సివిల్ స్వభావం ఉన్న వివాదాన్ని క్రిమినల్ కేసుగా ఎలా పరిగణిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.
కేసు వివరాల్లోకి వెళితే, 2019 ఎన్నికల సమయంలో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వంశీ నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో నూజివీడు రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీతామహాలక్ష్మి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వంశీకి కిందికోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇదే సమయంలో, వంశీపై ఉన్న అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో తమకు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను జులై 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.