ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలియజేశారు. అగ్నిమాపక అనుమతుల విషయంలో ప్రతి సంవత్సరం ఎన్‌వోసీ తీసుకునే నిబంధన నుంచి భారీ ఉపశమనం కలిగించారు. ఏటా ఫైర్ సేఫ్టీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలన్న నిబంధనను సవరిస్తూ విద్యాశాఖ జీవో విడుదల చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, 30 మీటర్ల లోపు ఎత్తు ఉన్న విద్యాసంస్థల భవనాలు ఇకపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఫైర్ ఎన్‌వోసీ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా, పాఠశాలల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ (రెన్యూవల్) గడువును పదేళ్లకు ఒకసారిగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి ఏటా ఎన్‌వోసీ తీసుకోవాలన్న నిబంధన ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, దీన్ని మార్చాలని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి లోకేశ్ ఈ ఫైల్‌పై చర్యలు తీసుకున్నారు.