ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్లు లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్లు లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్ నెరవేరవేరబోతుంది. కాగా మొదటి దశలో మంగళగిరిలో 3 వేల ఇళ్ల పట్టాల పంపిణీకి మంత్రి నారా లోకేశ్ రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, వారు నిర్మించుకున్న ఇంటిని క్రమబద్ధీకరించేలా శాశ్వత హక్కు కల్పిస్తూ ఇంటి పట్టాలు అందజేయనున్నారు.
కాగా ఏప్రిల్ 3వ తేదీన మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో మంత్రి నారా లోకేశ్ అందజేయనున్నారు. ఆయనే స్వయంగా లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు- మన లోకేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మంగళగిరిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇలా ఏప్రిల్ 12వ తేదీ వరకు పలు ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు.