Andrapradesh: జైళ్లశాఖపై హోంమంత్రి అనిత సమీక్ష..కీలక అంశాలపై చర్చ

రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జైళ్లశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

By Knakam Karthik
Published on : 4 Aug 2025 6:30 PM IST

Andrapradesh, Home Minister Vangalapudi Anitha, Prisons Department

Andrapradesh: జైళ్లశాఖపై హోంమంత్రి అనిత సమీక్ష..కీలక అంశాలపై చర్చ

అమరావతి: రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జైళ్లశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల, మౌలిక వసతుల కల్పన, పోస్టుల భర్తీ తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే జైళ్లశాఖలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 122 జైళ్లకు అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.

జైళ్లశాఖలో పోస్టుల భర్తీ

జైళ్లశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. ఇప్పటికే ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు నియమితులైనట్లు, మరో వ్యక్తిని నియమించే ప్రక్రియ కొనసాగుతోందని, 2025 జాబ్ కేలండర్‌లో మరొక పోస్టు భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక జైళ్ల ఆధునీకరణ, నిర్మాణ, మరమ్మతు పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం రూ.8 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. కడప సెంట్రల్ జైల్లో ఫ్యాక్టరీ బ్యారక్, విజయనగరం బోర్స్టల్ స్కూల్లో లివింగ్ బ్యారక్, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒక్కో బ్లాక్‌లో 120 ఖైదీల సామర్థ్యం గల రెండు కొత్త బ్లాక్‌లు, నెల్లూరు C.P. పరిధిలో వార్డర్లకు 36 క్వార్టర్లు, రూ.1.16 కోట్లతో అనంతపురం అగ్రికల్చర్ కాలనీలో డిప్యూటీ జైలర్ల భవనాల నిర్మాణం, కడప సెంట్రల్ జైల్లో ఎలక్ట్రికల్ పనులు చేపట్టినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, రేపల్లె, కడప ప్రత్యేక మహిళల జైళ్లలో విస్తరణ పనుల కోసం రూ.101 కోట్ల అవసరం ఉండగా, ఇప్పటికే రూ.54 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. వాల్మీకిపురం కొత్త సబ్ జైల్ పూర్తికి రూ.2.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు – పటిష్ట నిఘా

కోస్తాంధ్ర, గుంటూరు, కడప రేంజ్‌లలోని సెంట్రల్ జైళ్లలో మొత్తం 1740 సీసీ కెమెరాల ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అధికారుల కోసం 12 వాహనాలు, ఔట్‌లెట్ల వద్ద గస్తీ కోసం 25 టూ వీలర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పేరోల్ నిబంధనలు, క్షమాభిక్ష నియమాలపై సమీక్షలో చర్చించారు. పేరోల్ కూడా ఆన్ లైన్ చేసేదిశగా చర్చించారు. ముఖ్యంగా, ఖైదీలకు మంచి వసతులు కల్పించడం, జైళ్లను సమర్థంగా నిర్వహించడం, భద్రతా ప్రమాణాలు పెంపొందించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Next Story