అమరావతి: తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) జగదీష్‌ను విధుల నుంచి తొలగించడంపై హోంమంత్రి అనిత స్పందించారు. ''అతను నేను జీతమిచ్చి పెట్టుకున్న ప్రైవేట్ పీఏ. జగదీష్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో నేనే తొలగించా. ఇందులో వివాదం ఏముంది? టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే నా పిల్లలను సైతం పక్కన పెడతా'' అని స్పష్టం చేశారు.
హోంమంత్రి అనిత వద్ద పీఏ సంధు జగదీష్ గత పదేళ్లుగా పని చేస్తున్నారు. తాజాగా అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో అనిత అతడిని విధుల నుంచి తొలగించారు. మంత్రి పేరు చెప్పి జగదీశ్ అక్రమ వసూళ్లకు తెరతీశారని, పార్టీ నాయకులతో దురుసుగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణ, తిరుమల సిఫార్లు లేఖలు, మద్యం దుకాణాల్లో వాటాలవంటి పలు అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం.