అమరావతి: దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత ఆదేశించారు. ఎమర్జెన్సీలో ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగిపోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది.